భారత ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. బిట్‌కాయిన్‌ వంటి ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధ ప్రత్యామ్నాయమైన డిజిటల్‌ రూపాయి... నేటి నుంచి అందుబాటులోకి..

తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే.. ఎస్‌బీఐ సహా 9 బ్యాంక్‌ల ద్వారా జారీ

నెల రోజుల్లో రిటైల్‌ లావాదేవీలకు సైతం..

ముంబై: భారత ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. బిట్‌కాయిన్‌ వంటి ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధ ప్రత్యామ్నాయమైన డిజిటల్‌ రూపాయి వచ్చేస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) తొలి పైలట్‌ ప్రాజెక్టును నవంబరు 1న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు (హోల్‌సేల్‌ ట్రాన్సాక్షన్స్‌) మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రిటైల్‌ లావాదేవీల కోసం డిజిటల్‌ రూపీ తొలి పైలట్‌ ప్రాజెక్టును నెల రోజుల్లోపే ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. తొలి విడతగా, ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లు-మర్చంట్లతో కూడిన క్లోజ్డ్‌ యూజర్‌ గ్రూప్‌లకు మాత్రమే డిజిటల్‌ రూపాయి ద్వారా రిటైల్‌ లావాదేవీలు జరిపే అవకాశం కల్పించనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. డిజిటల్‌ రూపీ (హోల్‌సేల్‌) తొలి పైలట్‌ ప్రాజెక్టుగా సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ లావాదేవీల సెటిల్‌మెంట్‌ యూజ్‌ కేస్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.

ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీల కోసం డిజిటల్‌ రూపాయి జారీ చేసేందుకు ఎస్‌బీఐ సహా 9 బ్యాంక్‌లను ఎంపిక చేసినట్లు తెలిపింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌ఎ్‌సబీసీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పైలట్‌ ప్రాజెక్టు నేర్పే అనుభవాల ఆధారంగా భవిష్యత్‌లో ఇతర టోకు లావాదేవీలు, అంతర్జాతీయ చెల్లింపుల పైలట్‌ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. సీబీడీసీల్లో సెటిల్‌మెంట్‌ ద్వారా లావాదేవీల వ్యయం కూడా తగ్గుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. మార్కెట్‌ లావాదేవీలు నెరిపేందుకు సీబీడీసీ మరో ప్రత్యామ్నాయమని, డిజిటల్‌ రూపాయి అందుబాటులోకి వచ్చాక కూడా భౌతిక కరెన్సీ చెలామణి కొనసాగుతుందని ఈ మధ్యన విడుదల చేసిన కాన్సెప్ట్‌ నోట్‌ (నమూనా పత్రం)లో ఆర్‌బీఐ పేర్కొంది.