ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ ఫోన్‌ ఉంటోంది. దీనికి తగ్గట్టు హెడ్‌ ఫోన్స్‌ తప్పనిసరి అయ్యాయి.

చుట్టూ ఎంతమంది ఉన్నా ఫోన్ల ప్రపంచంలోనే అందరూ జీవిస్తున్నారు. సినిమా చూడటం, పాటలు వినడం, ఫోన్ మాట్లాడడం ఇలా పనేదైనా చెవిలో హెడ్‌ ఫోన్స్‌ ఉండాల్సిందే! కానీ దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఇన్ఫెక్షన్‌..

ఇయర్‌ ఫోన్స్‌ ఉపయోగించడం వల్ల చెవి లోపలికి గాలి వెళ్లేందుకు వీలుండదు. ఎక్కువసేపు వీటిని వాడటం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది.

తలతిరగడం..

ఎక్కువ సేపు చెవిలో హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని ఉండటం వల్ల శబ్ధాలు దగ్గరగా వింటారు. దీనివల్ల తల తిరుగుతుంది. చెవిలో గులిమి సహజంగానే చెవిలో గులిమి బయటకు వచ్చేస్తుంది. కానీ హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకోవడం వల్ల ఈ ప్రక్రియ జరగకుండా అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో గులిమి చెవిలోనే ఉండిపోతుంది. తద్వారా చెవినొప్పి, దురద వస్తుంది.

వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది..

ఎక్కువ సౌండ్‌ పెట్టుకుని వినడంతో చెవిపోటు వస్తుంది. ఇదే విధంగా తరచూ చేస్తుంటే పాక్షికంగా లేదా పూర్తిగా వినికిడి కోల్పోయో ప్రమాదం ఉంది.

ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

❃ సాధ్యమైనంత మేరకు ఇయర్ ఫోన్స్‌ వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.

❃ ఒకవేళ ఇయర్‌ ఫోన్స్‌ వాడటం తప్పనిసరి అయినట్లయితే ప్రతి అర్ధగంటకోసారి విరామం తీసుకోవాలి. దీంతో చెవిలోకి గాలి ప్రసరణ చక్కగా జరుగుతుంది.

❃ 70 నుంచి 80 డెసిబుల్స్‌ శబ్ధం వరకు మాత్రమే వినేలా జాగ్రత్త తీసుకోవాలి.

❃ నాణ్యమైన హెడ్‌ ఫోన్స్‌ వాడటం ఉత్తమం.

❃ చెవిలో నొప్పి, దురద, వినికిడి సమస్య వంటి ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించాలి