దేశంలోని టెలికాం కంపెనీలు వచ్చే ఏడాదిలో టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా 2023లో వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) 8.2 శాతం పెరుగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇది టెలికాం కంపెనీల రెండంకెల ఆదాయ వృద్ధికి దోహదపడుతుందని ఫిచ్ నివేదిక పేర్కొంది.

భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీలకు క్రమంగా పెరుగుతున్న సబ్‌స్క్రైబర్లను పరిగణలోకి తీసుకుంటే 2023లో ఆర్పు 7-10 శాతం పెరుగుదల ఉండొచ్చని ఫిచ్ విశ్లేషకులు తెలిపారు. ఇక, లాభదాయకతను దృష్టిలో ఉంచుకుని టారిఫ్ ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. చివరిగా, 2021 చివర్లో అన్ని టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ధరలను సవరించాయి. ప్రధానంగా మూడో దిగ్గజ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా తన ఖర్చులను భరించేందుకు, మూలధన నిధుల కోసం తప్పనిసరిగా టారిఫ్ ధరలను పెంచక తప్పదని నివేదిక అభిప్రాయపడింది. భారత టెలికాం కంపెనీలు ప్రపంచంలోనే అత్యల్పంగా రూ. 204 ఆర్పును కలిగి ఉన్నాయి. అలాగే, సగటు నెలవారీ డేటా వినియోగం అత్యధికంగా 20 జీబీ గా ఉంది.