ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకరికన్నా ఎక్కువ మందితో సమాచారాన్నిషేర్‌ చేసుకునేందుకు, అభిప్రాయాల్ని తెలియజేసేందుకు వాట్సాప్‌ (WhatsApp) గ్రూప్‌లను క్రియేట్ చేస్తుంటాం. కానీ, కొన్ని సందర్భాల్లో ఒకే విషయాన్ని వేర్వేరు గ్రూప్‌లలో షేర్‌ చేయడం విసుగు తెప్పిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్‌ కొత్తగా కమ్యూనిటీస్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతోపాటు మరో మూడు కొత్త ఫీచర్లను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఆ ఫీచర్లు ఏంటి? వాటితో యూజర్లుకు ఎలాంటి సేవలు అందుబాటులోకి రానున్నాయో చూద్దాం.  కమ్యూనిటీస్‌ ఈ ఫీచర్‌తో వేర్వేరు గ్రూప్‌లు కమ్యూనిటీస్‌ (Communities) లో భాగం కావచ్చు. గ్రూప్‌లకు అడ్మిన్‌ ఉన్నట్లుగానే.. కమ్యూనిటీస్‌ కూడా అడ్మిన్‌ ఉంటారు. అడ్మిన్‌ షేర్‌ చేసే సమాచారం అన్ని గ్రూప్‌లలో కనిపిస్తుంది. యూజర్‌ తమ గ్రూప్‌లో షేర్‌ చేసిన సమాచారాన్ని, కమ్యూనిటీస్‌లోని ఇతర గ్రూప్‌ సభ్యులు సైతం చూడొచ్చు. ఉదాహరణకు ఏదైనా కాలేజీలో ఒకే తరగతి  విద్యార్థులు తమ సెక్షన్ల వారీగా వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేశారు. ఈ  వాట్సాప్‌ గ్రూప్‌లు అన్నింటినీ కమ్యూనిటీస్‌లో ఒకే వేదికపైకి తీసుకురావచ్చు. అంటే, గ్రూప్‌లో సభ్యుల మాదిరే.. కమ్యూనిటీస్‌లో గ్రూప్‌లు ఉంటాయి. ఒక గ్రూప్‌లో షేర్‌ చేసిన సమాచారం ఇతర గ్రూప్‌ సభ్యులు చూడాలా? వద్దా? అనేది కమ్యూనిటీస్‌ అడ్మిన్‌ నిర్ణయిస్తారు. ఒక గ్రూప్‌లోని సభ్యులు, మరో గ్రూప్‌లో చేరటం, ఒకేసారి అన్ని గ్రూప్‌లలో సమాచారం షేర్‌ చేయడం వంటి అధికారాలు అడ్మిన్‌ చేతిలో ఉంటాయి.  చాట్ పేజీలో కమ్యూనిటీస్‌ పేరుతో ఫీచర్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి కొత్త కమ్యూనిటీ క్రియేట్‌ చేసి అందులో గ్రూప్‌లను చేర్చవచ్చు. కమ్యూనిటీలో చేర్చేందుకు గ్రూప్‌ అడ్మిన్‌ల అనుమతి అవసరమా? లేదా? అనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొద్దిమంది యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ అప్‌డేట్ పూర్తిస్థాయిలో యూజర్లకు పరిచయంకానుంది.  వాట్సాప్‌లో పోల్‌ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువ మంది గ్రూప్‌ సభ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు వాట్సాప్ ఇన్‌-చాట్ పోల్స్‌ (in-chat polls) అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో గరిష్ఠంగా 12 ఆప్షన్లు ఉంటాయి.  గ్రూప్‌ అడ్మిన్‌ పోల్‌ క్రియేట్ చేసి సభ్యులతో షేర్‌ చేస్తే, వారు తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసి పోల్‌లో పాల్గొనవచ్చు. ఈ ఫీచర్‌ కోసం యూజర్లు ఫైల్‌ అటాచ్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే పోల్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి పోల్‌ క్రియేట్ చేయొచ్చు.  గ్రూప్‌ కాలింగ్ ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకేసారి ఎనిమిది మంది వీడియో కాల్‌ (Video Calling) మాట్లాడే అవకాశం ఉంది. తాజా అప్‌డేట్‌లో ఈ సంఖ్యను 32 మందికి పెంచుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.  వాట్సాప్‌ వీడియోకాల్‌ ఫీచర్‌ పరిచయమైన తొలినాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేది. తర్వాత ఆ సంఖ్యను వరుసుగా నాలుగు, ఎనిమిదికి పెంచగా, తాజాగా 32కు చేరింది.  ఒకే గ్రూప్‌లో 1024 మంది గ్రూప్‌ (Groups)లో  వెయ్యి కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉండేలా మార్పులు చేయనున్నట్లు కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ ప్రకటించింది. తాజాగా గ్రూప్‌ సభ్యుల గరిష్ట సంఖ్యను 1024కు పెంచినట్లు తెలిపింది. దీనివల్ల ఒకేసారి ఎక్కువ మందితో సమాచారాన్ని సులువుగా షేర్‌ చేయవచ్చు