ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పరమశివుడి విగ్రహం రూపుదిద్దుకుంది. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌ జిల్లాలోని నాథ్‌ద్వారా పట్టణంలో 369 అడుగుల ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషితో కలిసి ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి 'విశ్వాస్‌ స్వరూపం' అని విగ్రహ స్థాపకులు నామకరణం చేశారు. ఈ సందర్భంగా దాదాపు పదేళ్లపాటు శ్రమించి విగ్రహాన్ని నిర్మించిన నిర్వాహకులను అశోక్‌ గెహ్లాట్‌ అభినందించారు. ఉదయ్‌పూర్‌ నగరానికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విగ్రహాన్ని తత్‌పదం సంస్థాన్‌ నిర్మించింది. కొండపై ధ్యానం చేస్తున్న భంగిమలో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు విగ్రహం కనిపించనున్నది. రాత్రి సమయంలో విద్యుద్దీప కాంతుల్లోనూ విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, విగ్రహ నిర్మాణానికి దాదాపు పది సంవత్సరాల సమయం పట్టగా.. నిర్మాణంలో 3వేల టన్నుల ఉక్కు, ఇనుము, 2.5లక్షల క్యూబిక్‌ టన్నుల కాంక్రీట్‌ను వినియోగించారు. 2012 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న గెహ్లాట్, మొరారీ బాపు సమక్షంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. ఇవాళ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.