పాస్‌పోర్ట్ ర్యాంకులు..

విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్..పాస్‌పోర్ట్ (Passport).పాస్‌పోర్ట్ లేకుండా వేరే దేశానికి వెళ్లడం చట్ట రీత్యా నేరం.

అయితే...అన్ని దేశాల పాస్‌పోర్ట్‌లకూ ఒకే విలువ ఉండదు. ర్యాంకుల ఆధారంగా దేని విలువ ఎంతో నిర్దరిస్తారు. ఏటా ఈ ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ ఏడాది ర్యాంకులు (India Passport Ranking 2022) వచ్చేశాయి. వీటిలో అఫ్ఘనిస్థాన్‌ పాస్‌పోర్ట్‌కు లీస్ట్ ర్యాంక్ రాగా...పాకిస్థాన్‌ 109వ స్థానంలో నిలిచింది.

భారత్‌కు 87వ ర్యాంకు దక్కింది. ఇండియాతోపాటు మౌరిటానియా, తజికిస్థాన్‌ కూడా 87వ స్థానంలో నిలిచాయి. పాస్‌పోర్ట్ ఉన్న భారతీయులు...వీసా లేకుండానే 60 దేశాలు చుట్టి రావచ్చు.

లండన్‌లోని ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ Henley & Partners ఈ ర్యాంకులు (Passport Ranking 2022) విడుదల చేసింది. ఇందులో ఏ పాస్‌పోర్ట్‌ పవర్‌ఫుల్, ఏది అతి సాధారణమైందో తేల్చి చెప్పింది. మొత్తం 199 దేశాల ర్యాంకులు ప్రకటించింది. International Air Transport Association ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు.

ఈ లిస్ట్ ప్రకారం చూస్తే...ప్రపంచంలోనే పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ జపాన్‌ దేశానిదేనని వెల్లడించింది. ఈ దేశ పౌరులు వీసా లేకున్నా...పాస్‌పోర్ట్‌తోనే 193 దేశాల్లో పర్యటించవచ్చు. ఇక సెకండ్ ర్యాంక్‌లో రెండు దేశాలున్నాయి. ఒకటి సింగపూర్ కాగా మరోటి దక్షిణ కొరియా.

మూడో స్థానంలో జర్మనీ, స్పెయిన్ ఉన్నాయి. నాలుగో స్థానంలో ఫిన్‌లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్‌ ఉన్నాయి. ఇక ఐదు, ఆరు ర్యాంకుల్లో దాదాపు 4 దేశాలున్నట్టు వెల్లడించింది.

టాప్‌ టెన్‌లో యూకే, బెల్జియం,నార్వే, న్యూజిలాండ్, గ్రీస్ చోటు సంపాదించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లో అఫ్ఘనిస్థాన్‌ చివరి స్థానంలో ఉంది. పాకిస్థాన్‌ ర్యాంక్‌ 109 కాగా, అఫ్ఘనిస్థాన్‌ ర్యాంక్ 112. సిరియా 110, కువైట్ 111 ర్యాంకుల్లో ఉన్నాయి.

వీసా లేకుండానే ప్రయాణం..

News Reels

ఎలాంటి వీసా లేకుండా టూరిస్టులను ఆహ్వానించే దేశాలు ఉన్నాయి. అందులోను ప్రత్యేకంగా భారతీయులకు కొన్ని దేశాలు వీసా ఫ్రీ విజిట్‌ను అందిస్తున్నాయి. దాదాపు 60 దేశాలు కేవలం ఇండియన్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా తమ దేశాల్లోని ఆహ్వానిస్తున్నాయి.

ఈ జాబితాలో ప్రసిద్ద టూరిజం డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. ఒమన్ , థాయిలాండ్ , మారిషస్ , మాల్దీవులు , లావోస్ , ఫిజి వంటి దేశాలకు వెళ్లిపోవచ్చు. భారత్‌ ఇకపై ఎలక్ట్రానిక్‌ చిప్స్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులను విడుదల చేయనుంది. 2022-23 ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిసింది.

ఈ కొత్త పాస్‌పోర్టులతో మరింత రక్షణ లభిస్తుంది. ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం, వేలి ముద్రలు, ప్రయాణిస్తున్న వివరాలు నిక్షిప్తం చేస్తారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వీటి గురించి వివరించారు.

వాస్తవంగా చిప్‌తో కూడిన ఈ-పాస్‌ పోర్టులను జారీ చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించుకుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (RFID), బయోమెట్రిక్‌ను ఇందులో ఉపయోగిస్తారు.

అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా ఇది ఉంటుందన్నారు. ఈ పాస్‌పోర్టు జాకెట్‌లోని ఎలక్ట్రానిక్‌ చిప్‌లో భద్రత సంబంధ వివరాలు ఎన్‌కోడ్‌ చేసి ఉంటాయి